శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Friday, June 11, 2010

త్వమేవ శరణం

త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీజగన్నాథా

వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీ సతీశ సరసిజనేత్రా
భూసురవల్లభ పురుషోత్తమ పీత కౌశేయవసన జగన్నాథా

బలభద్రానుజ పరమపురుష దుగ్ధ జలధివిహార కుంజరవరద
సులభ సుభద్రా సుముఖ సురేశ్వర కలిదోషహరణ జగన్నాథా

వటపత్రశయన భువనపాలన జంతు ఘటకారకరణ శృంగారాధిపా
పటుతర నిత్యవైభవరాయ తిరువేంకటగిరినిలయ జగన్నాథా


Download

తోరణములే దోవెల్లా

తోరణములే దోవెల్లా మూరట బారట ముంచినలతల

కూరిమిమటములు గోపురంబులును తేరుపడగెలే తెరువెల్లా
కోరినపండ్లుగురి సేటితరువులు తోరములైన వెదురుజొంపములు

ఆటలు దిరుపులు నందపుటురుపులు పాటలు వనవైభవమెల్లా
కూటువనెమళ్ళ కోవిలగుంపుల పేటల దేటలపెనుగూటములు

వింజామరలును విసనకర్రలును గొంజెగొడుగులే కొండెల్లా
అంజనగిరిరాయడు వేంకటపతి సంజీవని పరుషల కొదవగను

తొల్లియును మఱ్ఱాకు

తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూగెగన చెల్లుబడి నూగీని శ్రీరంగశిశువు

కలికి కావేరి తరగల బాహులతలనే తలగ కిటు రంగ మధ్యపు తొట్టెలను
పలుమారు దనునూచి పాడగా నూగీని చిలుపాల సెలవితో శ్రీరంగశిశువు

 అదివో కమలజుని తిరువారాధనం బనగ అదన గమలభవాండమను తొట్టెలను
ఉదధులు తరంగముల నూచగా నూగీని చెదరని సిరులతోడ శ్రీరంగశిశువు

వేదములే చేరులై వెలయంగ శెషుడే పాదుకొను తొట్టెలై పరగగాను
శ్రీదేవితో గూడి శ్రీవేంకటేశుడై సేదదీరెడి వాడె శ్రీరంగశిశువు

తొల్లింటి వలె

తొల్లింటి వలె గావు తుమ్మెదా యింక వొల్లవుగా మమ్మువో తుమ్మెదా

తోరంపు రచనల తుమ్మెదా కడు దూరేవు గొందులే తుమ్మెదా
దూరినా నెఱుగవు తుమ్మెదా మమ్ము వోరగా చూడకు వో తుమ్మెదా

తొలి ప్రాయపు మిండ తుమ్మెదా కడు తొలిచేవు చేగలే తుమ్మెదా
తొలకరి మెరుగువే తుమ్మెదా ఇంక ఉలికేవు మముగని వో తుమ్మెదా

దొరవు వేంకటగిరి తుమ్మెదా మా తురుమేల చెనకేవు తుమ్మెదా
దొరకెనీ చనవులు తుమ్మెదా ఇంక ఒరులెఱింగిరి గదవో తుమ్మెదా


Download

తొల్లి కలవే

తొల్లి కలవే యివియు తొల్లి తాను గలడే కల్లయునుగాదు కడు నిజము గాదు

కనుదెరచి నంతనే కలుగునీజగము కనుమూసి నంతనే కడుశూన్యమౌను
కనురెప్ప మరుగుననే కలిమియును లేమియును తన మనోభావనల తగిలి తోచీనీ

తలచినంతనె యెంత దవ్వైన గాన్పించు తలపు మరచిన మదికి దట్టమౌమదము
పొలసి మతి మరుగుననె పుట్టుటలు బోవుటలు పలుచంచల వికార భావమీగుణము

ముందు తాకలిగితే మూడు లోకములు గల వెందు దా లేకుంటె నేమియును లేదు
అంది శ్రీ వేంకటేశు నాత్మలో ననె వీడె కందువల నీతని సంకల్ప మీపనులు

తొలుబాపపుణ్యాలతోడ

తొలుబాపపుణ్యాలతోడ బుట్టితినట బలువైనభవముల భడలేనా

గాములయింటినే కాపనయితినట పాముపుట్టనుండియైన బతుకలేనా
గోమున హేయపుగుండకూడు నించితినట గామిడినేగారేతిత్తి గానోపనో

కట్లైనగుణములచే కట్టువడితినట చుట్టపుబంధాలరొచ్చుకు నోపనా
దట్టపుటాసల నేదాల్చితినట నా వెట్టకాయము మోవవెరచేనా

నిగిడినలోపల నీ వుండుదువట పగవారికి నే బగిలేనా
తగువేంకటేశ నీదయవాడనట యీ వగల నిన్నిట గెలువగలనా

తొక్కనిచోట్లు

తొక్కనిచోట్లు దొక్కెడిమనసు యెక్కడ గతిలే దింకనో తెరువు

పాపము వాయదు పైపై మనసున కోపము దీరదు కొంతైనా
దీపనబాధయు దీరదు కొంతైనా యేపున బెనగొనె నింకనో తెరువు

యెవ్వనమదమును నెడయదు కోరికె కొవ్వును నణగదు కొంతైనా
రవ్వగుమమకారము బెడబాయదు యెవ్విధియును లేదింకనో తెరువు

వెఱపును విడువదు వెడమాయలబడి కొఱతయు దీరదు కొంతైనా
తెఱగొసగేటి శ్రీతిరువేంకటపతి నెఱిగీనెఱగలే మికనో తెరువు

తే శరణంమహం

తే శరణంమహం తే శరణమహం శైశవకృష్ణ తే శరణం గతోస్మి

దశవిధావతార ధర్మరక్షణమూర్తి దశమస్తకాసురదశన
దశదిశాపరిపూర్ణ తవనీయస్వరూప దశావరణ లోకతత్త్వాతీత

 సహస్రలోచన సంతతవినుత సహస్రముఖ శేషశయనా
సహస్రకరకోటిసంపూర్ణతేజా సహస్రాదిత్య దివ్యచక్రాయుధా

అనంతచరణ సర్వాధారధేయ అనంతకరదివ్యాయుధా
అనంతనిజకల్యాణగుణార్ణవ అనంత శ్రీవేంకటాద్రినివాసా

తెల్లవారనియ్యరో

తెల్లవారనియ్యరో తెరువు యీ పల్లదపుదొంగలెల్ల బారాడుతెరువు

దొంతరపూవులతోట తూరుపుదెరువు చింతపూవుదేనెలచెమ్మతెరువు
సంతులేనిసతియింటిచాయతెరువు యింతలోనె చలిబడి యెండదాకేతెరువు

పముపుట్టగొంటిమీదిపడుమటితెరువు చీమకదొంతరలోనిచిన్నతెరువు
గాములుగాచుకయుండే గాలితెరువు యేమిటా నెక్కడవుత నెరగనితెరువు

అన్నిదిక్కులును దానేయైవున్న్నతెరువు పన్నీటికాలువలబాటతెరువు
కన్నుల వేంకటపతి గన్నతెరువు మిన్నునేలగూడినమీదితెరువు

తెలిసియు నత్యంతదీనుడై

తెలిసియు నత్యంతదీనుడై తన్ను దెలియగగోరేటితెలివే పో తెలివి

వలచినసతి దన్ను వడి గాలదన్నిన అలరి యెట్లా నుబ్బు నటువలెనే
తలక కెవ్వరు గాలదవ్వినా మతిలోన అలుగక ముదమందునదివో తెలివి

అరిదిమోహపు వనిత ఆలిపై దిట్టిన నరవిరై చొక్కినయటువలెనే
పరులు దన్ను వెలుపల నిట్ల బలికిన అరలేక రతి జొక్కునదివో తెలివి

తనివోక ప్రియకాంత తమ్ములపురస మాన ననయమును నటు గోరునటువలెనే
తనర వేంకటపతి దాసుల ప్రసాదంబు అనిశమును గొనగోరునదివో తెలివి

తెలిసినవారికి తెరువిదే

తెలిసినవారికి తెరువిదే మరిలేదు నళినాక్షు పొగడెడి నామములో నున్నది

ఆకసాన లేదు మోక్ష మటుపాతాళాన లేదు ఈకడ భూలోకమందు ఎందులేదు
పైకొని ఆసలెల్ల పారదోలి వెదకితే శ్రీకాంతు పొగడేటి చిత్తములో నున్నది

సురల వద్ద సోదించ నమృతము సరి దిక్కులందు లేదు జలధిలో లేదు
శరణాగతుల పాద జలముల జేర్చికొనే హరిదాసుల పూజించే అరచేత నున్నది

రాజసాన సుఖమేది రాసి కర్మమందునేది వోజతోడ నియతుడై వుండినా నేది
సాజాన శ్రీ వేంకటేశు సరి ముద్రలు ధరించే తేజముతో విజ్ఞన దేహములొ వున్నది

తెలిసినవాడా గాను

తెలిసినవాడా గాను తెలియనివాడా గాను యిల నొకమాట నీ కెత్తిచ్చితిగాని

పుట్టించేవాడవు నీవే బుద్దిచ్చేవాడవు నీవే యెట్టున్నా నపరాదా లేవి మాకు
అట్టూ నన్నవారముగా మనగా నీచిత్తమెట్టో కిట్టి వొక మాట మడిగితి నింతేకాని

మనసులోపల నీవే మరి వెలుపల నేవే యెనసి అపరాధాలు యేవి మాకు
నిను నౌగాదనలేము నీసరివారము గాము అనవలసినమాట అంటి మింతేకాని

అంతరాత్మవును నీవే అన్నిటా గావగ నీవే యెంతైనా నపరాధా లేవి మాకు
వింత లేక శ్రీవేంకటవిభుడ నీబంట నింతే వంతుకు నే నొకమాట వాకుచ్చితిగాని

తెలిసిన వారికి

తెలిసిన వారికి దేవుండితడే వలవని దుష్టుల వాదములేల

పురుషులలోపల పురుషోత్తముడు నరులలోన నరనారాయణుడు
పరదైవములకు పరమేశ్వరుడు వరుసమూఢుల కెవ్వరోయితడు

పలుబ్రహ్మలకును పరబ్రహ్మము మలయునీశులకు మహేశుడితడు
ఇలనాత్మలలో నిటుపరమాత్ముడు ఖలులకెట్లుండునో కానము యితడు

వేదంబులలో వేదాంతవేద్యుడు సోదించకరిగాచుచో నాదిమూలము
యీదెస శ్రీ వేంకటేశుడిందరికి గాదిలి మతులను గైకొనడితడు


Download

తెలిసిన బ్రహ్మోపదేశ

తెలిసిన బ్రహ్మోపదేశ మిదె సులభ మనుచు నిదే చూచీగాక

పుట్టించినహరి పూరి మేపునా గట్టిగా రక్షించుగా కతడు
కట్టడిజీవుడు కానక నోళ్ళు తెట్టదెరువునకు తెఱచీ గాక

అంతరాత్మ తనునట్టే మఱచేనా చింత లో బెరరేచీగాక
పంతపుజీవుడు భ్రమసి సందుసుడి దొంతలు దొబ్బుచు దూరీగాక

నొసల వ్రాసినవి నోమించుగా కత డెసగిన శ్రీవేంకటేశ్వరుడు
విసుగక జీవుడు వీరిడిమాయల నసురసురయి తా నలసీగాక

తెలిసిన తెలియుడు

తెలిసిన తెలియుడు తెలియని వారలు తొలగుడు బ్రహ్మాదులె యెరుగుదురు

వరదు డఖిలదేవతలకు వంద్యుడు గరుడు డసురులకు కంటకుడు
పరమాత్ముడంబుజ భవ శివాదులకు పరుల కెల్ల మువ్వురిలో నొకడు

దేవుడు సనకాది మునులకును పర దైవమఖిల వేదములకును
కైవల్యమొసగు ఘననిధికి మహానిధి జడులకు యాదవకులుడు

ఆద్యుడు అచలుడు మహాభూతమితడు అభేద్యుడసాధ్యుడు భీకరుడు
సద్యఃఫలదుడు సకల మునులకును వేద్యుడితడెపో వేంకటవిభుడు

తెలిసితేమోక్షము

తెలిసితేమోక్షము తెలియకున్న బంధము కలవమ్టిది బదుకు ఘనునికిని

అనయము సుఖమేడ దవల దు:ఖమేడది తనువుపై నాసలేనితత్వమతికి
పొనిగితే బాపమేది పుణ్యమేది కర్మమందు వొనర ఫలమొల్లవియోగికిని

తగినయమృతమేది తలవగ విషమేది తెగి నిరాహారియైనదీరునికిని
పగవారనగ వేరి బంధులనగ వేరీ వెగటుప్రపంచమెల్ల విడిచేవివేకికి

వేవేలువిధులందు వెఱపేది మఱపేది దైవము నమ్మినయట్టిధన్యునికిని
శ్రీవేంకటేశ్వరుడు చిత్తములో నున్నవాడు యీవలేది యావలేది యితనిదాసునికి

తెలిసి చెప్పేనంటే

తెలిసి చెప్పేనంటే తేటతెల్లమి నాగుట్టు కలసిన వాడవు కరుణించవయ్యా

మోము చూచిన వాడవు మోహించక మానేవా కోమలపు దాననై కొసరే గాక
చేముట్టిన వాడవు సేవగొనక మానేవా దామెన కోరికలతో దమకించే గాక

సేసవెట్టిన వాడవుచెనకక మానేవా ఆసపడ్డదాననై యడిగే గాక
బాస యిచ్చిన వాడవు పైకొనక మానేవా చేసూటి వలపుల జిమ్మిరేగే గాక

యీడ నన్నేలిన వాడవింటికి రాక మానేవా జోడైన దాననయి సొలసే గాక
కూడితి విట్టె నన్ను గొబ్బున శ్రీవేంకటేశ జాడెఱగక మానేవా చాటి చెప్పే గాక

తెలియా చీకటికి

తెలియా చీకటికి దీపమెతక పెద్ద వెలుగులోపలికి వెలుగేలా

అరయా ఆపన్నునికి అభయ మీవలెగాక ఇరవైనసుఖినీ కావనేల
వరదా బోయనివాని వడి దీయవలెగాక దరివాని తివియంగ తానేలా

ఘనఖర్మారంభుని కట్లు విదవలె గాక యొనసి ముక్తూని కవనేలా
అనయమూ దుర్బలునికి అన్నా మిడవలెగాక తనిసినా వానికి తానేలా

మితిలేని పాప కర్మికి తావలెగాక హితబెరుగు పున్యునికి తానేలా
ధ్రుతిహీను క్రుపజూచి తిరువేంకటేశ్వరుడు తతి గావకుండిన తానేలా

తెలియరాదు

తెలియరాదు మాయాదేహమా మమ్ము పలువికారాలబెట్టి పనిగొన్న దేహమా

దినమొక్కవయసెక్కే దేహమా సారె పెనుమదముగురిసేబెండు దేహమా
దినదినరుచిగోరే దేహమా నన్ను ఘనమోహపాశాల గట్టెగదె దేహమా

తెలివినిద్రలుగల దేహమా నీ పొలము పంచభూతాలపొత్తు దేహమా
తిలకించి పాపపుణ్యాల దేహమా బలుపుగలదాకా బదుకవో దేహమా

తీరనిసంసారపు దేహమా యిట్టె వూరట లేనిభోగాల వోదేహమా
కూరిమి శ్రీవేంకటేశు గొలిచితినిక నాకు కారణజన్మమవై కలిగిన దేహమా

తెలియని వారికి

తెలియని వారికి తెరమరుగు తెలిసిన వారికిదిష్టంబిదియే

కన్నుల యెదుటను గాంచిన జగమిది పన్నిన ప్రకృతియు బ్రహ్మమే
ఇన్నిటనుండగ ఇది గాదని హరి కన్న చోట వెదకగ బోనేల

ఆగపడి యిరువది యైదై జీవుని తగిలిన వెల్లా తత్త్వములే
నగవుల నిదియును నమ్మగ జాలక పగటున తమలో భ్రమయగ నేలా

 అంతరంగుడును నర్చావతారము నింతయు శ్రీ వేంకటేశ్వరుడే
చెంతల నీతని సేవకులకు మరి దొంతి కర్మముల తొడసిక నేలా