శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Monday, May 24, 2010

ఇహమేకాని యిక

ఇహమేకాని యిక బరమేకాని బహుళమై హరి నీపైభక్తే చాలు

యెందు జనించిన నేమి యెచ్చోటనున్ననేమి కందువనీదాస్యము గలిగితే జాలు
అంది స్వర్గమేకాని అలనరకమేకాని అందపునీనామము నాకబ్బుటే చాలు

దొరయైనజాలు గడు దుచ్ఛపుబంటైన జాలు కరగి నిన్నుదలచగలితే జాలు
పరులుమెచ్చినమేలు పమ్మిదూషించినమేలు హరినీసేవాపరుడౌటే చాలు

యిల జదువులురానీ యిటు రాకమాననీ తలపు నీపాదములతగులే చాలు
యెలమి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె చలపట్టి నాకు నీశరణమేచాలు

ఇహమెట్టిదో పరమెట్టిదో

ఇహమెట్టిదో పరమెట్టిదో ఇక నాకు సహజమై హరియే శరణము నాకు

చిత్తమిది యొకటే చింత వేవేలసంఖ్య పొత్తుల హరిదలచ బొద్దులేదు
జొత్తుల కన్నుల రెండు చూపులైతే ననంతాలు తత్తరించి హరిరూపు దగ్గరి చూడలేదు

చేతులివియు రెండే చేష్టలు లక్షోపలక్ష యీతల హరి బూజింప నిచ్చలేదు
జాతి నాలిక వొకటే చవులు కోటానగోటి రీతి హరినామ ముచ్చరించ వేళలేదు

వీనులివి రెండే వినికి కొలదిలేదు పూని హరిభక్తి విన బుద్ధి లేదు
యీనటన శ్రీవేంకటేశు డిటు చూచినను తానే యేలె నిక దడబాటు లేదు

ఇహమును బరమును

ఇహమును బరమును యిందే వున్నవి వహికెక్క దెలియువారలు లేరు

చట్టువంటి దీచంచలపుమనసు కొట్టులబడేది గుఱిగాదు
దిట్ట వొరులు బోధించిన గరగదు పట్టబోయితే పసలేదు

చిగురువంటి దీజీవశరీరము తగుళ్ళు పెక్కులు తతిలేదు
తెగనిలంపటమే దినమును బెనచును మొగము గల దిదే మొనయును లేదు

గనివంటిది యీఘనసంసారము తనిసితన్పినా దగ లేదు
ఘనుడగు శ్రీవేంకటపతి గావగ కొనమొద లేర్పడె కొంకే లేదు

ఇహము బరము

ఇహము బరము జిక్కె నీతనివంక అహిశయనునిదాసులంతవారు వేరీ

సిరికలిగినవారు చింతలిన్నిటను బాసి నిరతపువర్గముతో నిక్కేరటా
సిరికి మగడయిన శ్రీపతి యేలి మమ్మరయుచునున్నాడు మాయంతవారు వెరి

బలవంతుడైనవాడు భయములిన్నిట బాసి గెలిచి పేరువాడుచు గెరిలీనటా
బలదేవుడైన శ్రీపతి మా యింటిలోన అలరివున్నాడు మాయంతవారు వేరి

భూములేలేటివాడు భోగములతో దనిసి కామించి యానందమున గరగీనటా
సేమముతో భూపతైన శ్రీవేంకటేశుడు మాకు ఆముకొనివుండగా మాయంతవారు వేరీ

ఇహపరములకును

ఇహపరములకును ఏలికవు బహురూపంబుల ప్రహ్లాదవరదుడు

వేయికరంబుల వివిధాయుధంబుల దాయల నడచిన దైవమవు
నీయందున్నవి నిఖిల జగంబులు పాయక మమ్మేలు ప్రహ్లాదవరద

కదిమి దుష్టులను గతము చేసితివి త్రిదశుల గాచిన దేవుడవు
వదల కిందరికి వరములొసంగగ బ్రతికితి మిదివో ప్రహ్లాదవరద

శ్రీవల్లభుడవు చిత్తజగురుడవు కావలసినచో కలుగుదువు
శ్రీవేంకటాద్రిని శ్రీ అహోబలాన భావింతు నీమూర్తి ప్రహ్లద వరద

ఇసుక పాతర

ఇసుక పాతర యిందుకేది కడగురుతు రసికుడ నన్ను నింత రవ్వ శాయ నేటికి

బయలు వలె నుండును పట్టరాదు వలపు మొయిలి వలె నుండును ముద్దు శాయరాదు
నియతము లేదిందుకు నేరిచిన వారి సొమ్ము క్రియ యెరుంగు తా నన్ను గెరలించ నేటికి

గాలివలె బారుచుండు కానరాదు మనసు పాలవలె బొంగుచుండు పక్కన నణగదు
యేలీలా గెలువరాదు యెక్కితే యేనుగ గుజ్జు లోలోనే మమ్ము నింత లోచి చూడనేటికి

వెన్నెలే కాయుచు నుండు వింతగాను వయసు అన్నిటా వసంత ఋతువై యుండ బోదు
వున్నతి శ్రీ వేంకటేశుడుండ నుండ జవి బుట్ట మన్నించె యింక మారు మాటలాడ నేటికి

ఇవి సేయగ

ఇవి సేయగ నేనలసుడ యెటువలె మోక్షంబడిగెదను వివరముతోడుత నీవు సులభూడవు విష్ణుడ నిన్నే కొలిచెదగాక

జపయజ్ఞదానకర్మంబులు యెంచగ జిరకాలఫలంబులు యెపుడు బుణ్యతీర్థస్నానములు యిల పాపవిమోచనములు
అపరిమిత దేవతాంతరభజనలు ఆయాలోకప్రాప్తులు వుపవాసాది నియమవ్రతములు తపోనిష్ఠకు గారణంబులు

రవిచంద్ర గ్రహతారాబలములు భువిలో గామ్యఫలములు తవిలిన పంచేంద్రియ నిగ్రహంబులు తనుధరులకు దుర్లభములు
అవిరళ ధర్మార్థ కామంబులు మఱియైశ్వర్యములకు మూలములు ఆవల గ్రహణకానాలుష్ఠానము లధికఫలంబులు ఆశామయము

పరగ సప్తసంతాన బ్రాహ్మణ తర్పణములు ఖ్యాతిసుకృతములు అరయ బుత్రదార క్షేత్రసంగ్రహ మందరికిని సంసారభోగము
హరి నరహరి శ్రీవేంకటేశ్వరా అఖిలము నొసగెడిదాతవు సరగున నీవే దయతో రక్షించజాలుదు వేకాలమును మమ్ములను

ఇలువేల్పితడే

ఇలువేల్పితడే ఇందరికిని మరి పలువేల్పులతో పనియికనేలా

కమలారమణుని కరుణేకాదా అమరులు గొనియెడియమృతము
అమితపు శ్రీహరియాధారముగాదా నెమకేటి ప్రాణులు నిలిచిన భూమి

దనుజాంతకు బొడ్డుతామెర కాదా జననకారణము సర్వమునకు
మనికై హరిసతిమహిమే కాదా నినుపై భువిలో నిండినసిరులు

యితనికొడుకు రచనింతాఁగాదా సతులపతుల సంసారరతి
గతిశ్రీవేంకటపతిలోకమె వున్నతివైకుంటపునగరపుముక్తి

ఇలయును నభమును

ఇలయును నభమును నేకరూపమై జలజల గోళ్ళు జళిపించితివి

ఎడసిన నలముక హిరణ్యకశిపుని దొడికిపట్టి చేతుల బిగిసి
కెడసి తొడలపై గిరిగొన నదుముక కడుపుచించి కహకహ నవ్వితివి

రొప్పుల నూర్పుల రొచ్చుల కసరులు గుప్పుచు లాలలు గురియుచును
కప్పినబెబ్బులి కసరుహుంకృతుల దెప్పరపసురల ధృతి యణచితివి

పెళపెళనార్చుచు బెడబొబ్బలిడుచు థళథళ మెరవగ దంతములు
ఫళఫళ వీరవిభవరస రుధిరము గుళగుళ దిక్కుల గురియించితివి

చాతినప్రేవుల జన్నిదములతో వాతెరసింహపు వదనముతో
చేతులువేయిట జెలగి దితిసుతుని పోతర మణపుచు భువి మెరసితివి

అహోబలమున నతిరౌద్రముతో మహామహిమల మలయుచును
తహతహ మెదుపుచు దగువేంకటపతి యిహము బరము మాకిపుడొసగితివి

ఇరవైనయట్టుండు

ఇరవైనయట్టుండు యెఱగనీ దీమాయ తెరమఱగుమెకమువలె తిరుగు నీబ్రదుకు

అనిశమును దేహమున కన్నపానము లిడిన యినుము గుడిచిననీరు యెందుకెక్కినదో గొనకొన్నమానినులకూటములసుఖము లివి మనసుదాగినపాలు మట్టులేదెపుడు

వొదలబెట్టినసొమ్ము లొగి దనకు గానరా వడవి గాసినవెన్నె లది కన్నులకును
వుడివోనిపరిమళము లొకనిమిషమాత్రమే బెడిదంపుభ్రమతోడి పెనుగాలిమూట

చద్దిసంసారమున సరుస సుఖదుఃఖములు యెద్దుయెనుపోతునై యేకంబు గాదు
వొద్దికై శ్రీవేంకటోత్తముడు యింతలో అద్దంపునీడవలె నాత్మ బొడచూపె

ఇరవగువారికి

ఇరవగువారికి యిహపర మిదియే హరిసేవే సర్వాత్ములకు

దురితమోచనము దుఃఖపరిహరము హరినామమెపో ఆత్మలకు
పరమపదంబును భవనిరుహరణము పరమాత్ముచింతే ప్రపన్నులకు

సారము ధనములు సంతోషకరములు శౌరికథలు సంసారులకు
కోరినకోర్కియు కొంగుబంగరువు సారె విష్ణుదాస్యము లోకులకు

యిచ్చయగుసుఖము యిరవగుపట్టము అచ్చుతుకృప మోక్షార్థులకు
అచ్చపు శ్రీవేంకటాధిపు శరణము రచ్చల మాపాలి రాజ్యపుసుగతి

ఇయ్య కొంటి

ఇయ్య కొంటి నీపనులు ఇంతా మేలే చెయ్యి మీదాయ నాకు సిరులేమి బాతి

నయగారి వాడవు నాకు నీవు గలవు ప్రియములేమి గడమ పెక్కుమారులు
క్రియ లెఱుగుదువు కేలు చాచేవు నా మీద నియతాన నిందుకే నీ యాలనైతిని

చలపాది వాడవు సతమై వున్నాడవు చిలిము యేమి గడమ పై పై నేడు
వలపించ నేరుతువు వంచేవు నాపై ననుపు కలకాలమును నీకు గైవశమైతిని

శ్రీ వేంకటేశుడవు చేరి నన్నుగూడితివి దైవిక మేమి గడమ తగులాయను
భావమెఱుగుదువు పచ్చిగా నవ్వేవు నాతో వే వెలకును నీకే వెల్లివిరి యైతిని

ఇప్పుడిటు విభుబాసి

ఇప్పుడిటు విభుబాసి యింతలోననె నేడు తప్పు లోపలి తప్పు దైవమా చెలికి

నగవు లోపలి యలపు నంపైన పొలయలుక పగటు లోపలి వెరగు పచ్చివేడి
మొగము కాంతుల మెఱపు ముంచు నలుకల చెదరు పగలు చీకట్లాయె బాపురా చెలికి

బలిమి లోపలి భయము పలుకుదేనెల కనరు చెలిమి లోపలి చేదు చింత చెలికి
బలుపు కుచములలోని బట్టబయలగు నడుము కలిమి లోపలి లేమి కట కటా చెలికి

నిడుపు లోపలి కురుచ నీడ లోపలి యెండ వడి మంచి తరువు వడువని తమకము
కడు వేంకటేశ్వరుని కౌగిటను పరవశము మడుగు లోపలి మైల మాన దీచెలికి

ఇప్పుడిటు కలగంటి

ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి

అతిశయంబైన శేషాద్రిశిఖరము గంటి ప్రతిలేని గోపుర ప్రభలు గంటి
శతకోటి సూర్య తేజములు వెలుగగ గంటి చతురాస్యు బొడగంటి చయ్యన మేల్కొంటి

కనకరత్న కవాట కాంతు లిరుగడగంటి ఘనమైన దీపసంఘములు గంటి
అనుపమ మణీమయమ్మగు కిరీటము గంటి కనకాంబరము గంటి గ్రక్కన మేల్కొంటి

అరుదైన శంఖ చక్రాదు లిరుగడ గంటి సరిలేని యభయ హస్తము గంటి
తిరువేంకటాచలాధిపుని జూడగ గంటి హరి గంటి గురు గంటి నంతట మేల్కంటి


Download

ఇన్నిలాగులచేత

ఇన్నిలాగులచేత లివియపో కడు నెన్నికకెక్కిన చేతులివియపో

గునియుచు దనునెత్తికొమ్మని తల్లిపై నెనయజాచిన చేతులివియపో
కినిసి గోవర్ధనగిరి వెల్లగించిన యినుమువంటి చేతులివియపో

పిసికి పూతకిచన్ను బిగియించిపట్టిన యిసుమంతలు చేతులివియపో
పసుల గాచుచు గొల్లపడచుల యమునలో యిసుకచల్లిన చేతులివియపో

పరమచైతన్యమై ప్రాణులకెల్లను యెరవులిచ్చిన చేతులివియపో
తిరువేంకటగిరి దేవుడై ముక్తికి నిరవుచూపెడు చేతులివియపో

ఇన్నిరాసుల యునికి

ఇన్నిరాసుల యునికి యింతి చెలువపు రాశి కన్నె నీ రాశి కూటమి గలిగిన రాశి

కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశి మెలయు మీనాక్షికిని మీనరాశి
కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి చెలగు హరిమధ్యకును సింహరాశి

చిన్నిమకరాంకపు బయ్యెద చేడియకు మకరరాశి కన్నెపాయపు సతికి కన్నెరాశి
వన్నెమై పైడి తులదూగు వనితకు దులారాశి తిన్నని వాడి గోళ్ళ సతికి వృశ్చికరాశి

ఆముకొను నొరపుల మెరయు నతివకు వృషభరాశి గామిడి గుట్టుమాటల సతికి కర్కాటకరాశి
కోమలపు చిగురుమోవి కోమలికి మేషరాశి ప్రేమ వేంకటపతి గలిసె ప్రియ మిథునరాశి

ఇన్నియు ముగిసెను

ఇన్నియు ముగిసెను ఇటు నీలోననే పన్ని పరుల చెప్పగ చోటేది

కుందని నీ రోమకూపంబులలో గొందుల బ్రహ్మాండ కోట్లట
యెందరు బ్రహ్మలో యెంత ప్రపంచమో యిందు పరులమని యెంచగ నేది

నీ కొన చూపున నెరి కోటి సూర్యు లేకమగుచు నుదయించురట
నీ కాయమెంతో నీ వుని కేదో నీకంటె పరులని నిక్కగ నేది

జీవకోటి నీ చిన్ని మాయలో ప్రోవులగుచు నటు పొడమె నట
శ్రీవేంకటేశ్వర చెప్పగ నీవెంతో ఆవల పరులకు ఆధిక్య మేది

ఇన్నియు గలుగుటేజన్మమున

ఇన్నియు గలుగుటేజన్మమున నైన జెన్నలర హరిసేవ సిద్ధించుకొరకు

అరయ వేదాధ్యనమది బ్రహ్మశుద్ధికొర కిరవైన శాస్త్రంబులెరుక కొరక
తరి యజ్ఞములు ఋణోత్తారమయ్యెడి కొరకు సరిలేని దానములు జన్మములకొరకు

మమకారదూరంబు మనసు గెలుచుటకొరకౌ సమవివేకంబు శాంతములకొరకు
అమర శ్రీతిరువేంకటాద్రీశు మనసు నీ జముగెలుచు బ్రహ్మ విజ్ఞానంబుకొరకు

ఇన్నినేతలకు

ఇన్నినేతలకు నిది యొకటే కన్నా మన సిది కానదుగాని

పాతకకోట్లు భవములు భస్మీ భూతముసేయగ బొడవొకటే
శ్రీతరుణీపతిచింత, నిజముగా యేతరి చిత్తం బెఱగదుగాని

మరణభయంబులు మదములు మలినీ కరణము సేయగగల దొకటే
హరినామామృత మందుమీది రతి నిరతము నాకిది నిలువదుగాని

కుతిలములును దుర్గుణములును దృణీ కృతములు సేయగ గురుతొకటే
పతియగు వేంకటపతి సేవారతి, గతియని మతిగని కానదుగాని

ఇన్నిటికి మూలము

ఇన్నిటికి మూలము యీతనిరూపు యెన్నగ నుపమలకు నిరవైనట్లుండె

కమలనాభునికి కప్పురకాపు మేన సముచితముగ బైపై చాతినపుడు
అమృతముదచ్చేవేళ నట్టే మేన దుంపుర్లు తమితోడ నిండుకొని దట్టమైనట్లుండె

దైవశిఖామణికి తట్టుపుణుగు మేనను చేవమీర నించి సేవసేసేయప్పుడు
వేవేలుగా యమునతో వేమారు నీదులాడగా కావిరి కాళిమ నిండాగప్పినయట్లుండె

అలమేలుమంగతోడ నట్టే శ్రీవేంకటపతి కెలమితో సొమ్మువెట్టి యెంచినపుడు
కులికి గొల్లెతలను కూడగా గుబ్బలమీద గలపసపెల్లా వచ్చి కమ్ముకొన్నట్లుండె