శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Sunday, May 30, 2010

ఊరులేని

ఊరులేని పొలిమేర పేరు పెంపులేని బ్రతుకు గారవంబులేని ప్రియము కదియనేటికే

ఉండరాని విరహవేదన వుండని సురతసుఖమేల యెండలేని నాటి నీడ యేమిసేయనే
దండిగలుగు తమకమనెడి దండలేని తాలిమేల రెండు నొకటిగాని రచన ప్రియములేటికే

మెచ్చులేని చోట మంచిమేలు కలిగీనేమి సెలవు మచ్చికలేని చోట మంచిమాట లేటికే
పెచ్చు పెరగలేని చోట ప్రియముగలిగి యేమి ఫలము ఇచ్చలేనినాటి సొబగులేమి సేయనే

బొంకులేని చెలిమిగాని పొందులేల మనసులోన శంకలేక కదియలేని చదువులేటికే
కొంకు గొసరులేని మంచికూటమలర నిట్లుగూడి వేంకటాద్రి విభుడు లేని వేడుకేటికే

ఊరికి బోయెడి

ఊరికి బోయెడి వోతడ కడు చేరువతెరు వేగి చెలగుమీ

ఎడమతెరువువంక కేగిన దొంగలు తొడిబడ గోకలు దోచేరు
కుడితెరువున కేగి కొట్టువడక మంచి నడిమితెరువుననే నడవుమీ

అడ్డపుదెరువుల నటునిటు జుట్టాలు వెడ్డువెట్టుచు నిన్ను వేచేరు
గొడ్డేరేచిన్నదిడ్డితెరువు వోక దొడ్డపుతెరువువంక తొలగుమీ

కొండతెరువు కేగి కొంచెపుసుఖముల బండై తిరుగుచు బడలేవు
అండనుండెడి పరమాత్ముని తిరుమల కొండతెరువు తేకువ నేగుమీ

ఊరకే పోనియ్యరా

ఊరకే పోనియ్యరా నన్నుద్దండాన చేరలంతేసి కన్నుల జెంగలించే విప్పుడు

జూదమాడ బిలిచేవు చూపులనే జంకించేవు పేదవారి మేన సొమ్ము పెట్టనియ్యవా
కేదమున నోడి గెలిచితి నంటా నా పాదమంటి తీసుకోరా బంగారు మట్టెలు

నెత్తమాడ బిలిచేవు నెఱవాది నంటాను అత్తమామ గలవార మదేమిరా
ఒత్తి విన్నవించలేము ఓడితేను నీకు నాకు రిత్తమాట వద్దు రేఖ రేఖ పందెమా

సొక్కటాలు నిన్ననాడి సోలి సత్యభామకు మ్రొక్కితివి నేడు నాకు మ్రొక్కవలెగా
చక్కని వేంకటపతిస్వామి నన్నుంగూడితివి మొక్కెద కర్పూర తాంబూలమీరా చాలును

ఊరకే నీశరణని

ఊరకే నీశరణని వుండుటే నాపనిగాక యీరీతి నావుపాయము లేడ కెక్కీనయ్యా

ముందే అంతర్యామివై మొగి నాలో నుండగాను చెంది నిన్ను లేనివానిజేసుక నామనసులో
గొంది నీయాకారముగా కొంత నే భావించుకొంటా ఇందు గల్పిత ధ్యానము లెట్టు చేసేనయ్యా

కన్నులు జూచినందెల్ల కమ్మి నీవై యుందగాను అన్నిటా బ్రత్యక్షమందు అభావన చేసుకొని
విన్ననై తెలియలేక వేరే యెందొ వెదకుచు పన్నినప్రయాసాల బడనేటికయ్యా

శ్రీ వేంకటాద్రిమీద శ్రీపతివై కొలువుండి ఆవటించి తలపులో నచ్చొత్తి నట్టుండగాను
దేవు డెట్టివాడంటా తెగనిచదువులందు సోవలుగా నింకనేమి సోదించేనయ్యా

ఊరకే దొరకునా

ఊరకే దొరకునా వున్నతోన్నత సుఖము సారంబు దెలిసెగా జయము చేకొనుట

తలపులోని చింత దాటినప్పుదు గదా అలరిదైవంబు ప్రత్యక్షమౌట
కలుషంపు దుర్మదము గడచినప్పుడు గదా తలకొన్న మోక్షంబు తనకు చేకొనుట

కర్మంబు కసటువో గడిగినప్పుడు గదా నిర్మల జ్ఞానంబు నెరవేరుట
మర్మంబు శ్రీహరి నీమరగు జొచ్చినగదా కూర్మి దనజన్మమెక్కుడు కెక్కుడౌట

తనశాంత మాత్మలో దగలినప్పుడు గదా పనిగొన్న తనచదువు ఫలియించుట
యెనలేని శ్రీవేంకటేశ్వరుని దాస్యంబు తనకు నబ్బినగదా దరిచేరిమనుట

ఊరకున్న

ఊరకున్న వారితోడ వూరునోప దెఱగవా చేరినాతో ముద్దులెల్లా జెప్పేవు గాక

వద్దని నీతో నేను వాదులాడిచేనా గద్దించి యప్పటి నిన్ను గాదనేనా
తిద్ది నీ గుణాలు నేడు తీరుచ వచ్చేనా వొద్దనే నీ వెట్టుండినా మంటివి గాక

చలపట్టి నిను నేను సాధించ వచ్చేనా కలవి లేనివి తారుకాణించేనా
నిలువుకు నిలువే న్నిను నేరాలెంచేనా వెలివెంత నవ్వినా నవ్వితివి గాక

పంతమాడి సారెసారె బంగించ దొరకొనేనా వంతులకు నంతేసి వాసి పట్టేనా
యింతలో శ్రీవేంకటేశ యెనసితి విటునన్ను యెంత చనువిచ్చినాను ఇచ్చేవుగాక

ఊరకుండు మనవే

ఊరకుండు మనవే వొడబాటులిక నేలే కోరికలు గోరుకొంటా గొణగే గాని

ఆగపడితిమి తొల్లే ఆయను తన పొందు యెగసెక్కే లాడక తానిక నెన్నడే
జగడింప నోపము జవ్వనము మోచుకొని మొగము చూచి చూచి మూలిగే గాని

సేవలెల్లా జేసేము చెల్లుబడి గలవాడు యీ వలనవ్వులు నవ్వకిక నెన్నడే
చేపట్టి తియ్యనేల సిగ్గులుపై వేసుకొని దేవరంట మొక్కుకొంటా దీవించే గాక

కూడితిమి కౌగిటను గురుతు చన్నుల నంటె యీడనే ప్రియాలు సేయకిక నెన్నడే
జోడై శ్రీ వేంకటేశు చుట్టరికపు దనాన మేడెపు రతులలోన మెచ్చేము గాక