శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Friday, August 6, 2010

హరీ

హరీ ఆఆఆఆ ఆఆఆఆ,,,,, ఆఆఆఆఆఆ,,,,,ఆఆఆఆ,,,,
శరనంటి మాతని సంబంధమునజేసి మరిగించి మమునేలి మన్నించవే

సకల వేదములు సంకీర్తనలు చేసి ప్రకటించి నిను పాడి పావనుడైన
అకళంకుడు తాళ్ళపాక అన్నమాచార్యల వెకళియై ఏలిన శ్రీ వెంకట నిలయా

సామవేద సామగాన సప్తస్వరములను బాముతోని నీ సతి నిను పాడినయట్టి
ఆముకొన్న తాళ్ళపాక అన్నమాచార్యుల వేలలో మెచ్చిన శ్రీ వెంకట నిలయా

హీన దశలు

హీన దశలు బొంది ఇట్లు నుండుట కంటె నానా విధులను నున్ననాడే మేలు

అరుదైన క్రిమి కీటకాలందు పుట్టి పరిభవములనెల్ల బడితిగాని
ఇరవై నచింత నాడింతలేదు ఈ నరజన్మముకంటె నాడే మేలు

తొలగక హేయజంతువులయందు పుట్టి పలువేదనల నెల్ల బడితి గాని
కలిమియు లేమియు గాన నేడెరిగి నలగి తిరుగుకంటె నాడే మెలు

కూపనరకమున గుంగి వెనకకు నే బాపవిధులనెల్ల బడితిగాని
యేపున తిరువేంకటెశ నా కిటువలె నాపాలగలిగిన నాడే మెలు

హరివారమైతిమి

హరివారమైతిమి మమ్మవుగాదనగరాదు తరముగా దికను మాతప్పులు లోగొనరో

వెన్నడించిసూడువట్టేవిష్ణుమాయ నీకు నేము యిన్నిటా బంతమిచ్చేము యింక గావరో
నన్నల ఎట్టిగొనేటిసంసారబంధము నీకు మున్నె కిందువడితిమి ముంచి దయ జూడవో

ఆడించేటి కామక్రోదాదిజూజరులాల వోడితిమి మీకు దొల్లె వొరయకురో
వీడనికర్మమ నీకు వెఱచి వూరి గఱచే మీడనే ధర్మదార మా కికనైనా బట్టవో

దక్కగొన్న మాలోనితనుభోగములాల మొక్కితిమి మాకు గొంతమొగమోడరో
యెక్కువ శ్రీవేంకటేశు డేలె మా జన్మములాల గక్కున వేడుకొంటిమి కపటాలు మానరో

హరియే ఎరుగును

హరియే ఎరుగును అందరి బతుకులు యిరవై ఈతని యెరుగుటే మేలు

వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు యెనసి బ్రహ్మాండము లేలిరట
పెనగొని వారల పేరులు మరచిరి మనుజ కీటముల మరెవ్వడెరుగు

ఆసదొల్లి మును లనంతకోట్లు చేసిరి తపములు సేనలుగా
యేసిరులందిరి యెరగ రెవ్వరును వేసపునరులకు విధి యేదో

కలవనేకములు కర్మ మార్గములు పలుదేవతలిటు పాటించిరి
బలిమి శ్రీ వేంకట పతికి మొరయిడి వెలసిరి తుదనిదె వెరవిందరికి

హరిభక్తివోడ

హరిభక్తివోడ యెక్కినట్టివారలే కాని తరగు మొరగులను దాటలే రెవ్వరును

నిండు జింతాజలధికి నీళ్ళు దనచిత్తమే దండిపుణ్యపాపాలే దరులు
కొండలవంటికరళ్ళు కోరికె లెందు చూచినా తండుముండుపడేవారే దాటలే రెవ్వరును

ఆపదలు సంపదలు అందులోనిమకరాలు కాపురపులంపటాలే కైయెత్తులు
చాపలపుగుణములే సరిజొచ్చేయేరులు దాపుదండ చేకొని దాటలే రెవ్వరును

నెలవై వుబ్బునగ్గులే నిచ్చలు బోటును బాటు బలువైనయాళే బడబాగ్ని
యెలమి శ్రీవేంకటేశుహితులకే కాల్నడ తలచి యితరులెల్ల దాటలే రెవ్వరును

హరినెరుగనిపుణ్య

హరినెరుగనిపుణ్య మంటేరుగాన దురితాలే దురితాలే దురితాలే సుండీ

దొడ్డపుణ్యములు సేసి తుదలేనిసంపదలు అడ్డగించుకొని రాసులగుగురుతు
జడ్డులేనిహరికథ చవిలేకుండిన నిట్టే గొడ్డరే గొడ్డరే గొడ్డరే సుండీ

వలెనని మేలెల్ల వడిజేసి కైవల్య మలమి చేతిలోననగు గురుతు
తలపు వైష్ణవభక్తి దగులకుండిన నంతా అలయికే అలయికే అలయకే సుండి

తిరమైనట్టితీర్థాలు దిరిగి యందరిలొన ధర బుణ్యుడవుట యంతకు గురుతు
తిరువేంకటపతి దెలియకుండిన నంతా విరసాలే విరసాలే విరసాలే సుండీ

హరినామము కడు

హరినామము కడు నానందకరము మరుగవో మరుగవో మరుగవో మనసా

నళినాక్షు శ్రీనామము కలిదోషహరము కైవల్యము
ఫలసారము బహుబంధ మోచనము తలచవో తలచవో మనసా

నగధరు నామము నరకహరణము జగదేకహితము సమ్మతము
సగుణ నిర్గుణము సాక్షాత్కారము పొగడవో పొగడవో పొగడవో మనసా

కడగి శ్రీవేంకటపతి నామము ఒడి ఒడినే సంపత్కరము
అడియాలం బిల నతి సుఖమూలము తడవవో తడవవో తడవవో మనసా


Download

హరిదాసులతోడ

హరిదాసులతోడ నల్పులు సరెననరాదు గురుడు శిష్యుడుననే గుఱిదప్పుగానా

కోరి ముత్యపుజిప్పల గురిసినవానయు సారె బెమ్కులలోవాన సరియౌనా
శ్రీరమణు డిన్నిటాను జేరియుంటే నుండెగాక సారెకు బాత్రాపాత్రసంగ తంతా లేదా

మలయాద్రి మాకులును మహిమీదిమాకులును చలమున నెంచిచూడ సరియౌనా
అలరి దేవుడు అంతర్యామియైతే నాయగాక తెలియగ క్షేత్రవాసి దిక్కులందు లేదా

అమరులజన్మములు నసురలజన్మములు బమళి బుట్టినంతలో సరియౌనా
అమరి శ్రీవేంకటేశు డాతుమైతే నాయగాక తమితో నధికాతిభేదములు లేవా

హరిదాసుడై మాయల

హరిదాసుడై మాయల జిక్కువడితే వెఱపించబోయి తనే వెఱచినట్లవును

శూరుడైనవాడేడజొచ్చిన నడ్డములేదు ఆరీతిజ్ఞానినికి విధులడ్డములేవు
కారణాన నప్పటినీ గలిగెనా నది మఱి తేరిననీళ్ళ వండు దేరినట్లవును

సిరులరాజైతే నేమి సేసిన నేరమి లేదు పరమాధికారియైతే బాపములేదు
అరసి తనకుదానే అనుమానించుకొనెనా తెరువే పో సుంకరి దెలిపినట్లవును

భూమెల్ల మేసినా నాబోతుకు బందె లేదు నేమపుబ్రపన్నునికి నిందలేదు
యీమేర శ్రీవేంకటేశ్వరును శరణుని సోమరి కర్మమంటితే జుంటీగ కతవును

హరిదాసుండగుటే

హరిదాసుండగుటే యది తపము పరమార్థములను ఫలమేలేదు

తిట్టినయప్పుడు దీవించి నప్పుడు అట్టె సమమగునది తపము
వట్టినేమములు వేవేలు చేసినా బట్టబయలే గాని ఫలమే లేదు

ఇచ్చిన యప్పుడు ఇయ్యని యప్పుడు అచ్చుగ నవ్విన దది తపము
ఇచ్చల పుణ్యము లెన్ని చేసినా బచ్చన లింతే ఫలమే లేదు

కూడిన యప్పుడు గొణగిన యప్పుడు ఆడిక విడిచిన యది తపము
ఈడనే శ్రీవేంకటేశుడే శరణము పాడి పంతముల ఫలమే లేదు

హరి శరణాగతి

హరి శరణాగతి యాతుమది సరుస నిదియెపో సతమయ్యెడిది

దిన దిన రుచులివి దేహము విచెనకెటి కోరిక చిత్తముది
యెనసెటి కాంతులు యింద్రియంబులవి పనివి యాత్మకిని పసిలేదయ్యా

పదరెటి కోపము పాపముది అదవ గాలములు అనాదివి
నిదుర తమోగుణ నిలయముది యెదుట నాత్మకివి యెవరయ్యా

కాయపు జననము కర్మముది మాయ లంపటము మమతలది
యేయెడ శ్రీ వేంకటేశుడితని కృప పాయని యాత్మకు బ్రమాణమయ్యా

హరి రసమా

హరి రసమా విహారి సతు సరసోయం మమ శ్రమ సంహారి

దయా నిభృత తనుధారి సంశయాతిశయ సంచారి
కయాప్యజిత వికారి క్రియా విముఖ కృపాలధారి

పరామృత సంపాది స్థిరానందాశ్రేది
వరాలాభ వివాది శ్రీ తిరువేంకటగిరి దివ్య వినోది

హరి యవతారమే

హరి యవతారమే ఆతండితడు పరము సంకీర్తన ఫలములో నిలిపే

ఉన్నాడు వైకుంఠమున ఉన్నాడు ఆచార్యునొద్ద ఉన్నతోన్నత మహిమ అన్నమయ్య
ఉన్నవి సంకీర్తనలు ఒట్టుక లోకములందు అన్నీనా నారదాదులు పై పై పాడగాను

శ్రీ వేంకటాద్రి మీద శ్రీపతి కొలువు నందు ఆవహించె తాళ్ళపాక అన్నమయ్య
దేవతలు మునులును దేవుండని జయవెట్ట కోవిదుడై తిరుగాడి కోనేటి దండను

హరి యవతార

హరి యవతార మీతడు అన్నమయ్య అరయ మా గురుడీతడు అన్నమయ్య

వైకుంఠ నాథుని వద్ద వడి పడుచున్నవాడు ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య
ఆకసపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్నవాడు ఆకడీకడ తాళ్ళపాక అన్నమయ్య

ఈవల సంసార లీల ఇందిరేశుతో నున్నవాడు ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య
భావింప శ్రీ వేంకటేశు పదములందే యున్నవాడు హావ భావమై తాళ్ళపాక అన్నమయ్య

క్షీరాబ్ధిశాయి బట్టి సేవింపుచు నున్నవాడు ఆరితేరి తాళ్ళపాక అన్నమయ్య
ధీరుడై సూర్యమణ్డల తేజము వద్ద నున్నవాడు ఆరీతుల తాళ్ళపాక అన్నమయ్య

హరి నీవే

హరి నీవే బుద్ధిచెప్పి యాదరించు నామనసు హరి నీవే నాయంతర్యామివిగాన

వసముగానికరివంటిది నామనసు యెసగి సారెకు మదియించీగాన
పొసగ బాదరసము బోలిననామనసు అసము దించక సదా అల్లాడీగాన

వడి నడవుల చింకవంటిది నామనసు బడిబడి బట్టబట్ట బారీగాన
కడగి విసరుపెనుగాలివంటిది మనసు విడువక కన్నచోట విహరించీగాన

వరుస నిండుజలనిధివంటిది నామనసు వొరసి సర్వము లోనై వుండీగాన
గరిమ శ్రీవేంకటేశ కావవే నామనసు సరి నీయానతి నీకే శరణనిగాక

హరి నీవె

హరి నీవె సర్వాత్మకుడవు యిరవగు భావననీయగదె

చూడకమానవు చూచేటి కన్నులు ఏడనేవైనయితరములు
నీడలనింతానీరూపములని ఈడువదని తెలివీయగదె

పారక మానదు పాపపు మనసిది ఈరసములతో ఎంతైనా
నీరజాక్షయిది నీమయమేయని ఈరీతులతలపీయగదె

కలుగక మానవు కాయపు సుఖములు ఇలలోపల గలవెన్నైనా
అలరిని శ్రీవేంకటధిప నీకే యిలనర్పితమను ఇహమీయగదె

హరి నీయనుమతో

హరి నీయనుమతో ఆది నాకర్మమో పరమే యిహమై భ్రమయించీని

కలుగదు శాంతము కటకట బుద్ధికి చలమున నింతా జదివినను
నిలువదు చిత్తము నీపై చింతకు పలుసంపదలను బరగినను

తగులదు వైరాగ్యధన మాత్మకును వొగి నుపవాసము లుండినను
అగపడదు ముక్తి ఆసలనాసల జగమింతా సంచరించినను

విడువదు జన్మము వివేకముననే జడిసి స్వతంత్రము జరపినను
యెడయక శ్రీవేంకటేశ్వర నీవే బడిగాచితి విదె బ్రదికితి నేను

హరి గోవిందా

హరి గోవిందా హరి గోవిందా ఆనంద మానంద మాతుమకును
గురూపదేశాన వెదకగా వెదకగా గరిమ నీయర్దము కంటి మోయయ్యా

సరి నన్యధర్మములు మానుమంటివి శరణు నీకు జోరుమంటివి
దురితము లణచేనంటివి పరగ మోక్షం బిచ్చేనంటివి
హరి నీవచనము అమోఘము నరులము నే మిది నమ్మితిమి
పరమపద మిప్పుడే కలిగెను ధర నొక్క మనసుతో నున్నారమయ్యా

యెందు నీవే గతి యనుమంటివి యేచి యొక్కమాటే చాలునంటివి
యిందరి కభయ మిత్తునంటివి యిది నీ కెపుడు వ్రతమంతివి
కందువ నీబిరుదుసత్యము కానిమ్మని నేము చేపట్టితిమి
అంది నీవే మాకు దిక్కైతివి అన్నిటా సంతోసాన నున్నారమయ్యా

అసమావినవా డెక్కు డంటివి అతనివెంట దిరిగేనంటివి
భాసురపాదరేణువు నే నంటివి పావన మయ్యేనని యంటివి
మోసల్నిది నీసంకల్పము మొక్కే మిందులకు శ్రీ వేంకటేశా
ఆసపడ నితరుల నాకు నీవే యాస యని నీదాసులమై యున్నారమయ్యా

హరి గొలిచియు

హరి గొలిచియు మరీ నపరములా తిరముగ నతనినే తెలియుటగాకా

పంకజనాభునిపాదములు దలచి యింకా మరియొక యితరములా
అంకెల నతనివే ఆతనిదాసులనే కొంకొక నిజముగ గొలుచుటగాకా

పన్నగశయనునిబంట్లకు బంటై కొన్నిటిపై మరి కోరికెలా
యిన్నికోరికలు యిదియే తనకని కొన్నదికోలై కోరుటగాకా

వీనుల వేంకటవిభునామామృత మూనిన మతి మరియును రుచులా
తేనెలుగారెడితీపు లతనినుతి నానారుచులై ననుచుటగాకా


Download

హరి కృష్ణ

హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా తరవాత నా మోము తప్పకిటు చూడు

మేలుకొను నాయన్న మెల్లనే నీతోడి బాలులదె పిలిచేరు బడి నాడను
చాలు నిక నిద్దురలు చద్దికూళ్ళపొద్దు వేళాయ నాతండ్రి వేగ లేవే

కను దెరవు నాతండ్రి కమలాప్తు డుదయించె వనిత మొకమజ్జనము వడి దెచ్చెను
మొనసి మీతండ్రి యిదె ముద్దాడజెలగీని దనుజాంతకుండ యిక దగ మేలుకోవే

లేవె నాతండ్రి నీలీలలటు వోగడేరు శ్రీ వేంకటాద్రిపతి శ్రీరమణుడా
దేవతలు మునులు జెందిననారదాదులు ఆవలను బాడేరు ఆకసమునందు