శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Monday, July 19, 2010

మోహము విడుచుటే

మోహము విడుచుటే మోక్ష మది దేహ మెరుగుటే తెలివీ నదే

ననిచినతనజన్మము గర్మము దన పనియు నెరుగుటే పరమ మది
తనకు విధినిషేధములు బుణ్యముల ఘనత యెరుగుటే కలిమి యది

తరిదరి బ్రేమపు తల్లిదండ్రులను యెరుగనిదే కులహీన తది
చరుల బొరలి యాచారధర్మములు మరచినదే తనమలిన మది

కమ్మర గమ్మర గామభోగములు నమ్మి తిరుగుటే నరక మది
నెమ్మది వేంకటనిలయుని దాసుల సొమ్మయి నిలుచుట సుకృత మది

మోహంపు రతిముదము

మోహంపు రతిముదము ముద్దుజూపుల మదము దేహంపు సొబగెల్లదెలిపె సదమదము

మించు మట్టెల గిలుకు మెరుగు గుబ్బల కులుకు వంచు జూపుల చిలుకు వసివాడు బలుకు
మంచుజెమటల తళుకు మనసు లోపలి యళుకు అంచుటదరపు బెళుకు అలమేటి జళుకు

కరమూలములగరగు కదలు బయ్యెద చెరగు సిరుల చెలువపు మొరగు చెక్కుపై మరగు
గరిగరికె తతులెరుగు ఘాతలంటిన తెరగు గరిమతో చెలియునికి కప్పురపుటరగు

కలికి తనము పోగు కమ్మదావుల వేగు వలపు తమకముల పరవశము పెనుజాగు
కలకంటి బాగు వేంకటపతి జెలరేగు చెలియ సమరతుల మించిన వింతబాగు

మోసమున

మోసమున మాయావిమోహితుడైపోయి కాసుసేయనిపనికి గాసిబడె బ్రాణి

కన్నులనియెడి మహాకల్ప భూజములివి తన్ను బుణ్యునిజేయ దగిలి వచ్చినవి
వున్నతోన్నతబుద్ధి నొనగూర్ప కది దేహి కన్నచోటికి బరపి గాసిబడె బ్రాణి

చిత్తమనియెడి మహాచింతామణి దనకు తొత్తువలె వలసి దోడుతేగలది
హత్తించి హరిమిద నలరింప కది వృథా తిత్తిలో సుఖమునకు తిరిగె నీప్రాణి

కామతత్త్వంబనెడి కామధేనువు దనకు వేమారు గోరికెల వెల్లిగొలిపెడిది
యీమేను తిరువేంకటేశు జేరకపోయి కామాంధుడై మిగుల గతిమాలె బ్రాణి

మోపుల చిగురుల

మోపుల చిగురుల చిమ్ములవేదము ఆవుల మందలలోని ఆవేదము

మంచముపై చదివేది మరవకుమీ కొంచెపు లేబలుకుల కొనవేదము
పించపు శిరసుతోడ బిన్ననాడే చదివిన తుంచి తుంచిన మాటల తొలివేదము

చల్లలమ్మే గొల్లెతల చక్కని జంకెనలకు గొల్లపల్లెలోన దొరకొన్న వేదము
తల్లి బిడ్డ లనక యందరి నొక్క వావిగా పిల్లగ్రోవి నేరిపిన పెనువేదము

పంకజభవాదులు బడిబడి జదివించే లంకెలు చెలగిన మెలపువేదము
వేంకటనగము మీద వెలయు నిందిరగూడి కొంకొక చదివిన చొక్కుల వేదము

మొఱపెట్టెదము మీకు

మొఱపెట్టెదము మీకు మొగసాలవాకిటను మఱగుచొచ్చితి మీకు మము గావరో

యేపున మనసనియేటిమాపెంపుడు లేడి పాపమనేయడవి బడినది
రాపున హరికింకరపువేకకాండ్లాల పైపైని మాకింక బట్టియ్యరో

అంచెల మావిజ్ఞానమనెడి కామధేనువు పంచేంద్రియపు రొంపి బడినది
మించి వైకుంఠానకేగే మేటితెరువరులాల దించక యెత్తెత్తి వెళ్ళదియ్యరో

అండనే మోహాంధకారమనెడి మాదిగ్గజము దండి మీదయయనేటివో దాన బడెను

మొదలుండ గొనలకు

మొదలుండ గొనలకు మోచి నీళ్ళు వోయనేల యెదలో నీవుండగా నితరము లేలా

నిగమ మార్గముల నే నడచే నంటే నిగము లెల్లను నీమహిమే
జగము లోకుల జూచి జరిగెద నంటే జగములు నీ మాయ జనకములు

మనసెల్ల నడ్డపెట్టి మట్టున నుండే నంటే మనసు కోరికెలు నీ మతకాలు
తనువు నింద్రియములు తగ గెలెచే నంటే తనువు నింద్రియములు దైవము నీ మహిమా

 ఇంతలోని పనికిగా యిందు నందు జొరనేల చెంత నిండు చెరువుండ చెలమ లేలా
పంతాన శ్రీవేంకటేశ పట్టి నీకే శరణంటి సంత కూటాల ధర్మపు సంగతి నాకేలా

మొత్తకురే అమ్మలాల

మొత్తకురే అమ్మలాల ముద్దులాడు వీడె ముత్తెమువలె నున్నాడు ముద్దులాడు

చక్కని యశోద తన్ను సలిగతో మొత్తరాగా మొక్క బోయీ గాళ్ళకు ముద్దులాడు
వెక్కసాన రేపల్లె వెన్నలెల్లమాపుదాక ముక్కున వయ్యగ దిన్న ముద్దులాడు

రువ్వెడి రాళ్ళదల్లి రోల దన్ను గట్టెనంట మువ్వల గంటల తోడి ముద్దులాడు
నవ్వెడి జెక్కుల నిండ నమ్మిక బాలునివలె మువ్వురిలో నెక్కుడైన ముద్దులాడు

వేల సంఖ్యల సతుల వెంట బెట్టుకొనిరాగా మూల జన్నుగుడిచీని ముద్దులాడు
మేలిమి వెంకటగిరి మీదనున్నాడిదె వచ్చి మూలభూతి దానైన ముద్దులాడు

మొక్కేటి గోపాంగనల

మొక్కేటి గోపాంగనల మోహనాకారము చిక్కని నవ్వులు నవ్వీ శ్రీ వేంకటేశ్వరుడు

సత్యభామ ఉరముపై చల్లని కస్తూ రి పూత తత్త రించె రుక్మిణి చే తామర పూవు
హత్తి న భూకాంతకు యంగపు పయ్యెద కొంగు చిత్తగించరమ్మా వీడె శ్రీ వేంకటేశ్వరుడు

పంతపు పదారువేల బంగారు ఉంగరము బంతినే కుట్టబడిన పసిడి తాళి
వింతగా రాధాదేవి వేసిన కలువదండ చెంతలను వీడె అమ్మ శ్రీ వేంకటేశ్వరుడు

ఆసల తులసీదేవి అరచేతిలో అద్దము భాసురపు నీళాదేవి పట్టుగొమ్మ
శ్రీ సతి ఎక్కిన యట్టి సింహాసనపు గద్దె సేస పెట్టించుకొన్నాడు శ్రీవేంకటేశ్వరుడు

మైలవాసి మణుగాయ

మైలవాసి మణుగాయ మాటలేలరా చాలుజాలు బనులెల్ల జక్కనాయరా

టొడిబడ నవ్వితిని తోదుత నే మొక్కితిని చిదుముది నిక నేమి చేసేవురా
అడరి నేదిట్టితిని అంతలో బంతమిచ్చితి వదిగా బైపైనాతో వాదులేలరా

కోపగించి చూచితివి గొబ్బన నే మెచ్చితిని మాపుదాకా నింత జోలిమాట లేలరా
రేపకాడ నెడసితి మాపటమ్త గూడితివి యీపాటి వాసికిని యెగ్గులేలరా

మోవి గంటి సేసితి నామోవి తేనెలిచ్చితివి దేవుడ శ్రీ వేంకటేశ తెగువేలరా
భావమెల్ల గరగితి పక్కన మెప్పించ్తిని చేవదేరె బనులెల్ల జింత లేలరా

మేలే చెలియా

మేలే చెలియా మేలుగాల మిది తాలిమి లేదిదె తతిపో నాకు

వెన్నెలగాసి వెలది నేడిపుడు పున్నమచంద్రుడు పొడచెనటే
కన్నె కోవిలలకలకల మయ్యా వన్నె వసంతము వచ్చెనటే

కడగి చక్రవాకంబులు మూగీ పుడమి బొద్దివుడు పొడచెనటే
ముడివడి చకోరములు కడుబోలసీ అడరి సంద్వేళాయ నటే

చినుకులు రాలీ చిత్తజునెండల కనుగొన వానల కాలమటే
యెనసితి శ్రీవేంకటేశుడనే నిటు వనిత నీరతికి వరుసిది యటవే

మేలుకో శృంగారరాయ

మేలుకో శృంగారరాయ మేటి మదనగోపాల మేలుకోవె నాపాల ముంచిన నిధానమా

సందడిచే గోపికల జవ్వనవనములోన కందువందిరిగే మదగజమవు
యిందుముఖి సత్యభామ హృదయ పద్మములోని గంధము మరిగినట్టి గండు తుమ్మెద

గతిగూడి రుక్మిణికౌగిట పంజరములో రతిముద్దు గురిసేటి రాచిలుకా
సతుల పదారువేల జంట కన్నుల గలువల కితమై పొడిమిన నా యిందు బింబమ

వరుసం గొలనిలోని వారి చన్నుంగొండలపై నిరతి వాలిన నా నీలమేఘమా
శిరనురమున మోచి శ్రీ వేంకటాద్రి మీద గరిమ వరాలిచ్చే కల్పతరువా

మేలుకొనవే

మేలుకొనవే నీలమేఘ వర్ణుడా వేళ తప్పకుండాను శ్రీవేంకటేశుడా

మంచము పై నిద్ర లేర మల్లెల వేసేరు ముంచి తురుము ముడువ మొల్లల వేసేరు
కంచము బొత్తారగించ కలువలవేసేరు పించపు చిక్కు తీర సంపెంగలు వేసేరు

కలసిన కాక దీర గన్నెరుల వేసేరు వలపులు రేపి విరజాజుల వేసేరు
చలువుగా వాడుదేర జాజులవేసేరు పులకించ గురువింద పువ్వుల వేసేరు

తమిదేర గొపికలు తామరలు వేసేరు చమటార మంచి తులసిని వేసేరు
అమర శ్రీ వేంకటేస అలమేలుమంగ నీకు గమత పన్నీటితో చేమంతుల వేసేరు


Download

మేలు లేదు

మేలు లేదు తేలు లేదు మించీ నిదే హరిమాయ కాలమందే హరి గంటి మొకటే

సురలును జీవులే నసురలును జీవులే ధర నిందు బ్రకృతిభేదమేకాని
సురలకు స్వర్గ మసురలకు నరకము పరగ నీరెంటిగతి పాపపుణ్యములే

పొలతులు జీవులే పురుషులు జీవులే తలప భావభేదములేకాని
బలిమి స్వతంత్రము బరతంత్ర మొకరికి యెలమి నిందులో జెల్లే హీనాధికములే

రాజులును జీవులే రాసిబంట్లు జీవులే వోజతో సంపద చెల్లే దొకటే వేరు
సాజపుశ్రీవేంకటేశు శరణ మొక్కటే గతి బాజు గర్మ మొండొకటి బంధమోక్షములు

మేదిని జీవుల

మేదిని జీవుల గావ మేలుకోవయ్యా నీదయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా

తగుగోపికల కన్నుదామరలు వికసించె మిగుల సూర్యనేత్రుడ మేలుకోవయ్యా
తెగువ రాక్షసులనే తిమిరము విరియగ నెగడిన పరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా

ఘనదురితపు గలువలు వికసించె మినుకు శశినేత్రుడ మేలుకోవయ్యా
పనివడి వేదాలనే పక్షులెల్లా బలుకగ జనక! యాశ్రితపారిజాత మేలుకోవయ్యా

వరలక్ష్మీ కుచచక్రవాకము లొండొంటి రాయ మెరయుదోషరహిత మేలుకోవయ్యా
పొరసి నీవు నిత్యభోగములు భోగించ నిరతి శ్రీవేంకటేశ నేడు మేలుకోవయ్యా


Download

మేడలెక్కి నిన్ను

మేడలెక్కి నిన్ను జూచి కూడెననే యాసతోడ వాడు దేరి వుస్సురందురా వెంకటేశ యాడానుంటి విందాకనురా

పిక్కటిల్లు చమ్ములపై చొక్కపు నీ వుంగరము గక్కన నే నద్దుకొందురా వెంకటేశ లక్కవలె ముద్ర లంటెరా

నిండ బూచిన మావిపై గండు గోవిల గూయగా నిండిన నీయెలు గంటాను వెంకటేశ అండకు నిన్ను రమ్మంటినా

నీవు వలచిన వలపు లాకలొత్తె నామతిని వాకున నేజెప్ప జాలరా వెంకటేశ లోకమెల్ల నెరిగినదే

పాయము నీకొకనికే చాయగా మీదెత్తితిని యీయెడ గైవాలకుండాను వెంకటేశ మాయింటనే పాయకుండరా

ముమ్మాటికి నీ బాసలే నమ్మివున్నదాన నేను కుమ్మరించరా నీకరుణ వెంకటేశ చిమ్ము జీకటెల్ల బాయను

మెరుగు వంటిది

మెరుగు వంటిది యలమేలుమంగ అరిమురి నవ్వీని అలమేలుమంగ

పలుచని యెలుగున బాడీ నీ మీది పాట మెలుపు గూరిమి నలమేలుమంగ
చెలులతో నీ సుద్ది చెప్పిచెప్పి కరగీని అలయుచు సొలయుచు నలమేలుమంగ

ఈడుగా నీ రాకకు నెదురెదురుచూచీ మేడ మీద నుండి యలమేలుమంగ
వాడు మోముతో నీపై వలపు చల్లి చల్లి ఆడీ నాట్యము సారె నలమేలుమంగ

పేరుకొని పిలిచీని ప్రియములు చెప్పి చెప్పి మేరమీర నిన్ను నలమేలుమంగ
యీరీతి శ్రీవేంకటేశ నిన్ను గూడె నేడు ఆరితేరి నన్నిటాను అలమేలుమంగ

మెచ్చెనొక రాగంబు

మెచ్చెనొక రాగంబు మీద మీద కడు నిచ్చె నొక రాగంబు యింతులకు నెల్ల

చేసె నొక రాగంబు చెలియెదుట గన్నులనె మూసె నొక రాగంబు ముదిత మతినె
పూసె నొక రాగంబు పొలతి పులకలమేన వ్రాసె నొక రాగంబు వనిత నినుబాసి

పట్టె నొక రాగంబు ప్రాణములపై నలిగి తిట్టె నొక రాగంబు తిరిగి తిరిగి
పుట్టె నొక రాగంబు పొలతి డెందమునకును మెట్టె నొక రాగంబు మెరయుచునె కదలి

కురిసె నొక రాగంబు కొప్పు పువ్వులనె సతి మురిసె నొక రాగంబు ముంచి మేన
తిరువేంకటేశ్వరుడ తెలిసికో నినుబొంది పొరసె నొక రాగంబు పొలతి కుచములనే

మూసిన ముత్యాన

మూసిన ముత్యాన కేలే మొరగులు ఆశల చిత్తాన కేలే అలవోకలు

కందులేని మోమున కేలే కస్తూరి చిందు నీకొప్పున కేలే సీమంతులు
మందయానమున కేలే మట్టెల మోత గంధమేలే పై కమ్మని నీమేనికి

భారపు గుబ్బల కేలే పయ్యద నీ బీరపు జూపుల కేలే పెడమోము
జీరల భుజాల కేలే చెమటలు నీ గోరంట గోళ్ళ కేలే కొనవాండ్లు

ముద్దుల మాటల కేలే ముదములు నీ యద్దపు జెక్కుల కేలే అరవిరులు
వొద్దిక కూటమి కేలే వూర్పులు నీకు నద్దమేలే తిరువేంకటాద్రీశు గూడి

మూల మూల

మూల మూల నమ్ముడు చల్ల ఇది రేలు పగలు కొనరే చల్ల

పిక్కటిల్లు చన్నుల గుబ్బెత ఒక్కతి కడు చక్కనిది చిలికిన చల్ల
అక్కున చెమటగార నమ్మీని ఇది యెక్కడ పుట్టదు కొనరే చల్ల

వడ చల్లుమేని జవ్వని ఒక్కతి కడు జడియుచు చిలికిన చల్ల
తడబడు కమ్మని తావులది మీ రెడయ కిపుడు కొనరే చల్ల

అంకుల కరముల వొయ్యారొక్కతి కడు జంకెనల చిలికిన చల్ల
వేంకటగిరిపతి వేడుకది ఇది ఇంకా నమ్మీ కొనరే చల్ల

మూడేమాటలు

మూడేమాటలు మూడుమూండ్లు తొమ్మిది వేడుకొని చదవరో వేదాంత రహస్యము

జీవస్వరూపము చింతించి యంతటాను దేవుని వైభవము తెలిసి
భావించి ప్రకృతి సంపదయిది యెరుగుడే వేవేలు విధముల వేదాంత రహస్యము

తనలోని విజ్ఞానము తప్పకుండా దలబోసి పనితోడ నందువల్ల భక్తినిలిపి
మనికిగా వైరాగ్యము మరవకుండుతే వినవలసిన యట్టి వేదాంత రహస్యము

వేడుకతో నాచార్య విశ్వాసము గలిగి జాడల శరణాగతి సాధనముతో
కూడి శ్రీవేంకటేశుగొలిచి దాసుడౌటే వీడని బ్రహ్మానంద వేదాంత రహస్యము