మూసిన ముత్యాన కేలే మొరగులు ఆశల చిత్తాన కేలే అలవోకలు
కందులేని మోమున కేలే కస్తూరి చిందు నీకొప్పున కేలే సీమంతులు
మందయానమున కేలే మట్టెల మోత గంధమేలే పై కమ్మని నీమేనికి
భారపు గుబ్బల కేలే పయ్యద నీ బీరపు జూపుల కేలే పెడమోము
జీరల భుజాల కేలే చెమటలు నీ గోరంట గోళ్ళ కేలే కొనవాండ్లు
ముద్దుల మాటల కేలే ముదములు నీ యద్దపు జెక్కుల కేలే అరవిరులు
వొద్దిక కూటమి కేలే వూర్పులు నీకు నద్దమేలే తిరువేంకటాద్రీశు గూడి
No comments:
Post a Comment